ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 2:32 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

We will not hand over RTC lands to private individuals: Minister Ponnam Prabhakar

ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించంమంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్అర్జున్ సమాచారం ప్రతినిధి సెప్టెంబర్ 10.

శాసనసభలో  ఆర్టీసీ పై పలువురు ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు.
మంత్రి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజలకు రైల్వేలు దేశవ్యాప్తంగా లైఫ్లైన్ అయితే.. తెలంగాణ ప్రజలకు ఆర్టీసీ లైఫ్లైన్. ప్రతిరోజూ సుమారు 30 లక్షల కిలోమీటర్లు బస్సులు తిరుగుతూ, 65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గత ప్రభుత్వం పదేళ్లలో ఆర్టీసీని నిర్లక్ష్యం చేసి సంస్థను నిర్వీర్యం చేశారని అన్నారు.
రిటైర్డ్ ఈడీని ఎండీగా నియమించి సంస్థ నిర్వహణను బలహీనపరిచారు. కొత్త బస్సులు కొనుగోలు చేయకుండా ఆర్టీసీని నష్టాల బాటలోకి నెట్టారు. కార్మికుల సమస్యలను కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం. ఇది మహిళల ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఆర్టీసీకి కూడా కొత్త ఊపునిచ్చింది. మహాలక్ష్మి పథకం తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగిందని అన్నారు.
బస్ స్టేషన్లు, బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటివరకు 347.47 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి, రూ.12,171 కోట్లు ఆదా చేసుకున్నారు. మహిళలు ఆసుపత్రులకు, దేవాలయాలకు, బంధువుల ఇళ్లకు, పిల్లల చదువుల కోసం ప్రయాణించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతోంది. గత శాసనసభ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాం. నియోజకవర్గాల వారీగా బస్సుల అవసరాలు, ప్రజల సమస్యలపై వినతులు తీసుకున్నాం. ప్రజల డిమాండ్కు అనుగుణంగా కొత్త సర్వీసులు, అదనపు ట్రిప్పులు ప్రారంభిస్తున్నాం. కరోనా సమయంలో రద్దైన సర్వీసులను కూడా అవసరమైన చోట పునరుద్ధరిస్తున్నాం. ప్రతిరోజూ 65 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడంలో డ్రైవర్లు, కండక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. వారి కష్టాన్ని, సేవలను ఈ సభ అభినందించాలి. గతంలో ఆపరేషనల్ లాస్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆర్టీసీ ఇప్పుడు నష్టాల నుంచి లాభాల దిశగా పయనిస్తోంది. సంస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఇప్పటివరకు 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేశాం. 15 సంవత్సరాలు దాటిన బస్సులను ఆర్టీసీలో కొనసాగించకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 340  డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్ బస్సులు గా రెట్రోఫిట్ చేశాం. హైదరాబాద్ నగరంలో PM E-Drive కింద 2,200 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నాం. ఆర్టీసీ పరిధిలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో ఇప్పటికే క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రీమియం కేటగిరీ బస్సులతో పాటు ఎలక్ట్రిక్ బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్లో జిల్లా ఎస్పీ సహకారంతో ఆ జిల్లా బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టాం. భవిష్యత్లో అవసరమైన అన్ని బస్సుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. హైదరాబాద్లో లాస్ట్ మైల్ కనెక్టివిటీని మరింత మెరుగుపరుస్తున్నాం. మెట్రో, ఎంఎంటీఎస్ స్టేషన్ల నుంచి ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా అదనపు బస్సు రూట్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్లో 370 కొత్త రూట్లలో బస్సులు నడుపుతున్నాం..అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు చేరాలా కార్యచరణ తీసుకున్నాం. ప్రజల అవసరాలకు అనుగుణంగా కొత్త రూట్లను కూడా పెంచుతున్నాం. గతంలో 97 డిపోలు ఉండగా ప్రస్తుతం 99 డిపోలకు పెంచాం. పెద్దపల్లి, ములుగు డిపోలను ఏర్పాటు చేశాం. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లను పరిశీలించి అవసరమైన చోట కొత్త డిపోలు ఏర్పాటు చేస్తాం. మహాలక్ష్మి పథకం తర్వాత బస్ స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అందుకు అనుగుణంగా బస్ స్టేషన్లలో మౌలిక వసతులు మెరుగుపరుస్తున్నాం. అవసరమైన చోట CSR, ఇతర నిధుల సహకారంతో కూడా అభివృద్ధి పనులు చేపడతాం. యాదాద్రి ఆలయానికి వెళ్లే ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు వంగర వద్ద ఎక్స్ప్రెస్ బస్సులు నిలిపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.
ప్రజల అవసరాలు, ఎమ్మెల్యేల సూచనల మేరకు బస్సుల స్టాపేజీలను పరిశీలిస్తున్నాం. ఆర్టీసీ స్థలాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విధానం మా ప్రభుత్వంలో లేదు. ఆర్టీసీ ఆస్తులను కాపాడుతూ సంస్థ అభివృద్ధికి వినియోగిస్తాం. గాజులరామారం, శంషాబాద్, ఫ్యూచర్ సిటీ ప్రాంతాల్లో బస్ టెర్మినల్స్ అభివృద్ధికి అవసరమైన స్థలాలను తీసుకున్నాం. పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్టీసీ స్థలాలు తీసుకుంటే, అదే విధంగా ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వ స్థలాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు.